కవిత్వాన్ని నువ్వు రాయలేవు
తనను రాయించుకుంటుంది కవిత్వం

మేఘాలను పోగేసి వానను

గ్లిజరిన్ కన్నీళ్లను నటించి 
దుఖ్ఖాన్నీ

కృత్రిమ రంగులేసి 
ఒక కొత్త పువ్వును
నువ్వు సృష్టించలేవు

పెటిల్లున విచ్చుకత్తుల మెరుపులతో
గుండె మేఘం చీలి
చేతులు పట్టలేని దయతో ఒకసారి

తన్నుకు వచ్చిన వరద తాకి
బద్దలైన యెద చెరువు కట్ట
చిమ్మిన ప్రవాహంలా మరోసారి

అగ్నినీ అమృతాన్నీ కలగలిపి
ఆకాశాన్నీ భూమినీ ముడివేసి
పాతాళాన్నీ స్వర్గాన్నీ తోసేసి
ఒక వర్ణ ప్రపంచ సుమంగా
ఇంకో సారి

కవిత్వం నిన్ను రాయించుకుంటుంది

నువ్వు కవి వనుకుంటావు
నిన్ను తన దూతవనుకుంటుంది కవిత్వం

Comments

Popular posts from this blog

ఒక్కసారి రారా తమ్మీ!