శవం నవ్వుతున్నది

ఊరును నమ్ముకొని,
మనుషుల నమ్ముకొని,
మానవత్వాన్ని నమ్ముకొని,
పెళ్ళాం పిల్లల రెక్కల కష్టంతో సాదుకొని
కీళ్ళు అరిగి, ఎముకలు విరిగి, మనసు నలిగి,
పెరిగి పెరిగి వృద్దమైన,
పోరి పోరి రాలిపోయిన ఈ పువ్వుకు తన నీడను నిషేధిస్తే,
నడిచి నడిచి ఆగిపోయిన తన నడకల వాడలో యాత్రను నిరాకరిస్తే
తన ఊరే తనను అరిష్టమంటే
నిన్నటి తన నేల మీద వీళ్ళు ఎన్నాళ్లుంటారని
ఈనాటి వృద్ధ శవం నవ్వుతున్నది
అసమాన పోరులో చిద్రమై పోయి
ఇంటికి వచ్చిన వీర శరీరం నవ్వుతున్నది
వలస బాటలో తిరిగివచ్చిన
దుబాయి శవం నవ్వుతున్నది
ఊరికవతల చెట్టుకు వేలాడిన
ఎండిన డొక్కల పడుగు పేకల ఆస్థి పంజరం నవ్వుతున్నది
పత్తి చేనులో మిత్తికి బలైన బక్కెద్దులాంటి
బడుగు నల్ల కాయం నవ్వుతున్నది
అన్ని నమ్మకాలు వమ్ము చేసిన
మూర్ఖ, మూఢ నమ్మకాల వ్యవస్థను చూసి
సభ్య సమాజం నవ్వుతున్నది.

Comments

Popular posts from this blog

ఒక్కసారి రారా తమ్మీ!