ఒక్క తీరు దుఃఖం

భౌగోళికాలు మనుషులను ఎకేరు చెయ్యకపోవచ్చు
ఒక్క ఇల్లే రెండు వక్కలు ఐనప్పుడు ఒక బాధ ఉంటది గద
- పోరాటం జేసి విడిపోవుడు వేరు
పోరువెట్టి విడగొట్టుడు వేరు
- ఎవల ప్రయోజనాలు వాళ్లకు ఉంటయి గావచ్చు
నీది వేరే జిల్ల అనే ఒక కంచెనైతే పాతిండ్రు గద
- ఊల్లెదూల్లెనే చెల్లె మరొకలింటికి వోతె
కంటి శోకం తియ్యని మనిషి ఉంటడా
- మనుషుల నడుమ ఒక నున్నటి తీగె అల్లుకొని ఉంటది
అది బొడ్డు పేగే కాకపోవచ్చు
ఒక గుట్ట, ఒక పుట్ట, ఒక మట్టి
ఒక నది నీరు, ఒక దేవుని బొట్టు, ఒక స్థూపం యాది
-- ఇంకా మాట్లాడితే
ఒక్క తీరు మాట
ఒక్క తీరు పాట
ఒక్క తీరు ఆరాటం
ఒక్క తీరు పోరాటం
-- భౌగోళికాలు మనుషులను ఎకేరు చెయ్యకపోవచ్చు
ఒక్క తీరు అల్లుకపోయిన తీగెలు ఎక్కడికైనా పాకవచ్చు
బాధ ఒక్కటే, మనుసు ఒక్కటే, బతుకు ఒక్కటే
కాళ్ళనూ చుట్టవచ్చు
బరిసెనూ పట్టవచ్చు
పోరాటాన్నీ నిలబెట్టవచ్చు
పొట్టోని నెత్తిని పొడుగోడుగొడితే
పొడుగోని నెత్తిని పోశమ్మ కొట్టనూ వచ్చు

Comments

Popular posts from this blog

ఒక్కసారి రారా తమ్మీ!